Breaking Newshome page sliderHome Page SliderNational

కేంద్ర బడ్జెట్ ఒక ‘అబద్ధాల పుట్ట’

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బడ్జెట్ 2026-27పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిని ఒక ‘అబద్ధాల పుట్ట’గా అభివర్ణించారు. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ బడ్జెట్ దిశానిర్దేశం లేనిదని , సామాన్య ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప, ఆచరణలో ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనదని ఆమె ఘాటుగా విమర్శించారు.
ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉందని మమత ఆరోపించారు. ముఖ్యంగా యువత, పేదలు, ఎస్సీ-ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు , విద్యా రంగానికి ఈ బడ్జెట్ లో ఎలాంటి ఆశాజనకమైన కేటాయింపులు లేవని ఆమె ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజ్యాంగ నిర్మాణాన్ని , స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శిస్తూ, ఇలాంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. పన్నుల రూపంలో రాష్ట్రాల నుంచి నిధులు వసూలు చేస్తున్న కేంద్రం, తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడు మాత్రం తామేదో గొప్పలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.
బెంగాల్ రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మమత ఆరోపించారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడు కారిడార్ల అంశంపై స్పందిస్తూ, ఇప్పటికే తమ రాష్ట్రం ఆ ప్రాజెక్టులపై పని చేస్తోందని గుర్తు చేశారు. పురూలియాలోని ‘జంగల్ సుందరి’ ఎకనామిక్ కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ. 72,000 కోట్ల పెట్టుబడి పెడుతోందని, కేంద్రం సహాయం లేకుండానే తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. బడ్జెట్ లోని అంకెలు హిమాలయాలను దాటిపోయేంత అసత్యాలని ఆమె ఎద్దేవా చేశారు.
చివరగా, దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బడ్జెట్ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలడమే దీనికి నిదర్శనమని మమత పేర్కొన్నారు. మరోవైపు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బడ్జెట్‌పై తక్షణమే స్పందించడానికి నిరాకరించారు. తాను రేపు పార్లమెంటు వేదికగా అధికారికంగా మాట్లాడతానని, అక్కడ తన అభిప్రాయాలను సమగ్రంగా వెల్లడిస్తానని మీడియాకు తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, దేశాభివృద్ధి కోసం కాదని తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.