సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలంపై ఇంకా తొలగని సందిగ్థత
కర్ణాటకలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వింటుంటే ఇంకా సీఎం పదవిపై సందిగ్థత తొలగలేదని అనిపిస్తోంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఎంపీ ఎం.బి. పాటిల్ ఐదేళ్ల వరకు కూడా సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. దీనితో పార్టీలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. పార్టీ పూర్తి మెజారిటీ సాధించిన తర్వాత కూడా వారం రోజులపాటు ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయింపబడలేదు. పార్టీ పెద్దల జోక్యంతో అనేక మల్లగుల్లాలు పడి చివరికి సీఎంగా సిద్దరామయ్యను, డిప్యూటీ సీఎంగా డి.కే. శివకుమార్‌ను నిర్ణయించింది అధిష్టానం. కానీ కొందరి వ్యాఖ్యలు వింటుంటే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేనట్లు అనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ అధికార పంపిణీపై తానేమీ మాట్లాడనని, అన్ని విషయాలు ఢిల్లీ స్థాయిలే జాతీయ నేతలే నిర్ణయిస్తానని, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కాగా మంత్రివర్గ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి. ఈ విషయంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలతో చర్చలు జరుపుతారు. ఇదిలా ఉంటే ఇలా ప్రతీ నిర్ణయం ఢిల్లీ స్థాయిలో తీసుకుంటే కర్ణాటక ప్రజలు ఏరికోరి వీరిని ఎన్నుకున్నదెందుకనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

