Home Page SliderNational

ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణపతాకం..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేశారు. దేశ త్రిదళాల సైనిక వందనం అందుకున్నారు. ఈసందర్భంగా దేశ ప్రజలకు స్పూర్తినిచ్చే పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని.

ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు సాధించిన యువ క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కల అని, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆందోళన పడవద్దని అక్కడి భారతీయులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో తాము అన్ని విధాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భారత్‌లో మహిళలు అనేక రంగాలలో పురోగమిస్తున్నారని, కానీ ఇక్కడ మన సోదరీమణులపై కొన్ని హేయమైన దాడులు జరగడంపై దేశ ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారని అర్థం చేసుకున్నానన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా ఇలాంటి చర్యలపై తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితులకు కఠిన చర్యలు విధిస్తామని పేర్కొన్నారు.

ఇటీవల సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై జారీ చేసిన ఆదేశాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని, సెక్యులర్ సివిల్ కోడ్‌ను డిమాండ్ చేస్తామన్నారు.

భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడం అనేది మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు భారంగా మారిందన్నారు. మన యువత ఇక్కడే చదువుకునేలా విద్యావ్యవస్థ అభివృద్ధి చెందుతోందన్నారు. బిహార్‌లోని నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి, శతాబ్ధాల నాటి విద్యాస్ఫూర్తిని తిరిగి నిలబెడుతున్నామని పేర్కొన్నారు.