Andhra PradeshNews

ఏపీలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 98 లక్షలు, మహిళలదే పై చేయి

◆జాబితా ప్రకటించిన సీఈవో ముఖేష్ కుమార్
◆ డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరణ
◆ జనవరి 5, 2023న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

ఏపీలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 98 లక్షల 54 వేల 93 మందిగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ తెలిపారు. పురుషులు కోటి 97 లక్షల 15 వేల 615గా ఉండగా… మహిళలు 2 కోట్ల ఒక లక్షా 34 వేల 621గా ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 3,858గా ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు పురుషులతో పోల్చితే 4.8 లక్షలు అధికం. మొత్తం ఓటర్లలో సాధారణ ఓటర్లు 3 కోట్ల 91 లక్షల 79 వేల 83కాగా.. వారిలో ఎన్నారైలు 6,895, సర్వీస్ ఓటర్లు 68,115గా నిర్ధారించారు. ఐతే ఈ జనవరితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నికరంగా… 8 లక్షల 82 వేల 366 మంది తగ్గారని ఈసీ పేర్కొంది. అదే సమయంలో కొత్త ఓటర్లు 2 లక్షల 41 వేల 463గా తేల్చింది. ఓటర్ల జాబితా నుంచి 11 లక్షల 23 వేల 829ని తొలగించినట్టు వివరించింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2023ను ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ విడుదల చేశారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 63 నియోజకవర్గాల్లో అంత మంది ఓటర్లేంటంటూ కొత్త వర్షన్ మొదలైంది. జనాభాతో పొలిస్తే 63 స్థానాల్లో ఎక్కువ మంది ఓటర్లున్నారంటూ లెక్కలు చెబుతున్నాయ్. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు 724 మంది ఓటర్లున్నట్టు తేలింది. అదే సమయంలో 20 చోట్ల 800 మంది, 43 చోట్ల 750 మంది ఓటర్లు ఉండటంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కొత్త వారు ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని సీఈసీ చెప్పారు. జనవరిలో తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఓటరు కార్డుకు ఆధార్ లింకు 60 శాతం పూర్తయ్యిందన్న ఆయన.. అదేమీ తప్పనిసరి కాదన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు.

ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై 19వ తేదీ వరకు విచారణ చేపడుతామని తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు