Andhra PradeshHome Page Slider

స్వల్ప తేడాతో ఓడిన సీట్లపై తెలుగుదేశం పార్టీ ఫోకస్

• కొత్త వ్యూహాలతో పోరుకు రెడీ అవుతున్న చంద్రబాబు
• ఈసారి ఎన్ని కలకు పొరపాట్లకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు

ఏపీలో ఇప్పటికే తనదైన వ్యూహాలతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త వ్యూహాలతో పోరుకు రెడీ అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి అంశంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ అధికారపక్షంపై నిప్పులు చెరుగుతున్నారు. ఒకవైపు నియోజకవర్గ ఇన్చార్జిలతో వరస భేటీలు నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గంపై సమీక్షలు జరిపి ఆయా నియోజకవర్గాల్లో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి అభ్యర్థులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిన సీట్లపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో దాదాపుగా 50 నియోజకవర్గాలకు పైగా స్వల్ప ఓట్ల తేడాతో కొన్ని సీట్లను కోల్పోవడంతో ఈసారి ఆ స్థానాల్లో గెలవడానికి సరికొత్త ఆలోచనలను ఆయన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకుండా ముందుకు సాగటంతో ఆ పార్టీ ప్రభావంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలిచే స్థానాలను సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలపై తిరిగి పట్టు సాధించేందుకు చంద్రబాబు కసరత్తులు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో జరిగిన పొరపాట్లకు ఈసారి ఎలాంటి తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని జనసేన ప్రభావంతో పార్టీకి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే పనిలో చంద్రబాబు నిమగ్నం అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా స్వల్ప తేడాతో చేజార్చుకున్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పోలైన ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ వివరాలు అన్నిటిని క్రోడీకరిస్తూ కొత్త వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా 50 స్థానాలకు పైగా నియోజకవర్గాల్లో జనసేనకు వచ్చిన ఓట్లు అధికార పార్టీ మెజార్టీ కన్నా ఎక్కువగా ఉండటంతో ఈ అంశాన్ని చంద్రబాబు జాగురకతో పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో 23 మంది శాసనసభ్యులు ఉండగా వారిలో నలుగురు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. మిగిలిన 19 స్థానాలకు సంబంధించి వారిని అభ్యర్థులుగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే గతంలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన సీట్లను తిరిగి కైవసం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న 19 మంది తిరిగి గెలిస్తే విజయం కచ్చితంగా సాధ్యమవుతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనతో పొత్తులు ఖరారు అయితే ప్రస్తుతం దృష్టి సారిస్తున్న స్థానాల్లో కొన్ని స్థానాలను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం ఆయా నియోజకవర్గాల్లో చూపించిందో ఎక్కడ మెజార్టీ సాధించిందో ఆస్థానాలని జనసేనకు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. దీనివల్ల అభ్యర్థుల ఖరారులో ఇబ్బందులు లేకపోవడంతో పాటు గెలుపు కూడా ఖాయం అన్న థీమాలో తెలుగుదేశం పార్టీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కలన్నీ పూర్తిస్థాయిలో వేస్తున్న చంద్రబాబు కొత్త ఎత్తుగడలతో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.