దేశానికి తెలంగాణ పోరాటం దిక్సూచి
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ , వామపక్ష పార్టీలు కలిసి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలో సీపీఐ శత వసంతాల ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మతం అనే సెంటిమెంటుతో ప్రజలను తప్పుదోవ పట్టించి, కార్పొరేట్ ,ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట విశిష్టతను భట్టి గుర్తుచేశారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన పోరాటం ప్రపంచానికే కొత్త సందేశాన్ని ఇచ్చిందని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం సాగిన ఈ ఉద్యమాల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పాత్ర అమోఘమని, ఏ ఇంటి తలుపు తట్టినా ఒక వీరగాథ వినిపిస్తుందని అన్నారు. 1950లో బూర్గుల రామకృష్ణారావు తెచ్చిన కౌలుదారి చట్టం నుండి, ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, ఉపాధి హామీ పథకం వంటి గొప్ప మార్పుల వెనుక వామపక్షాల సహకారం ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఓటు హక్కును నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని భట్టి విమర్శించారు. భారతదేశం కేవలం వర్గాలపై కాకుండా కులాలపై నిర్మితమైందని, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ముందుకు సాగాలని సూచించారు. ఖమ్మం జిల్లా విభిన్న భావజాలాలకు, ఆతిథ్యానికి పెట్టింది పేరని, దేశవ్యాప్త వామపక్ష నేతలు ఇక్కడ సమావేశం కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా సమాజం కోసం, సగటు మనిషి హక్కుల కోసం ఐక్య పోరాటాల ద్వారా కార్పొరేట్ శక్తులకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

