హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం చారిత్రాత్మక తీర్పు
సుప్రీంకోర్టు మానవీయకోణంలో ఆలోచించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. కేసు పూర్వాపరాలకొస్తే ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కూల్చివేతల అంశంపై ఈ తీర్పు వెలువడింది. హల్ద్వానీలోని బన్ భూల్ పురా అనే ప్రాంతంలోని భూమి రైల్వేశాఖకు చెందినదని, అక్కడ 29 ఎకరాల భూమిలో స్థానికులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని రైల్వేశాఖ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు ఆ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత నెలలో తీర్పునిచ్చింది. వారం రోజుల ముందుగా నోటీసులు ఇచ్చి, కూల్చివేతలు చేసుకోవచ్చని ఆదేశించింది. అయితే ఈస్థలంలో దాదాపు 4 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ తీర్పును సవాలు చేస్తూ స్థానికులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

సుప్రీం న్యాయమూర్తులు S.K.కౌల్, A.S ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ఇక్కడ స్థానికులు దాదాపు 60 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారని, వారిని ఈ రకంగా ఖాళీ చేయించే వీలులేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అక్కడి వారికి తప్పనిసరిగా పునరావాసం కల్పించాలని, తర్వాతే వారిని అక్కడి నుండి ఖాళీ చేయించాలని ఉత్తర్వులిచ్చింది. దాదాపు 50 వేల మందిని రాత్రికి రాత్రే వెళ్లగొట్టడం మంచి పద్దతి కాదని, ఇలాంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రోత్సహించదని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఫిబ్రవరి 7 వతేదీకి వాయిదా వేసింది.