నీట్ విషయంలో సుప్రీం కోర్టు దర్యాప్తు చేయించాలి..కాంగ్రెస్ చీఫ్
నీట్ పరీక్ష విషయంలో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకయ్యిందని, గ్రేస్ మార్కులు కలిపారని, అవినీతి జరిగిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను కేవలం ఎన్టీఏపై నెట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

