Home Page SliderNational

ఈసీని కదిలించిన సుప్రీం కోర్టు.. జమ్ము, కాశ్మీర్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది!?

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2014 నుండి పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో రాష్ట్రంగా ఉన్న 2018 నుండి గవర్నర్ పాలనలో ఉంది. ఇక్కడ పోలింగ్ మూడు దశల్లో జరుగనుంది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఎన్నికలు జరిగుతాయి. ఫలితాలు అక్టోబర్ 4 న ప్రకటిస్తారు. సెప్టెంబరు 30 నాటికి జమ్మూ కాశ్మీర్ లోయలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నాహకంగా, అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 20 నాటికి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని ఈసీ తెలిపింది. దాదాపు 87 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నట్లు ఈసీ తెలిపింది. “ప్రజలు మార్పును కోరుకుంటున్నారు… వారు కొత్త భవిష్యత్తును స్క్రిప్ట్ చేయాలనుకుంటున్నారు,” అని ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ చెప్పారు.

“ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి ఇటీవల J&K ను సందర్శించాం. గొప్ప ఉత్సాహం కనిపించింది. ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ప్రజలు వీలైనంత త్వరగా ఎన్నికలు కోరుకుంటున్నారు.” అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో J&K మరియు లడఖ్‌లలో పోలింగ్ బూత్‌ల వద్ద “పొడవైన క్యూ”లను గుర్తుచేసుకున్నారు. ఆ క్యూలు, “ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా, ఆ మార్పులో భాగం కావాలనుకుంటున్నారని, ఆశావదంతో తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నారని చెప్పారు. తమ విధిని తామే రాయాలనుకుంటున్నారని చెప్పారు. ప్రజలు బుల్లెట్ల కంటే బ్యాలెట్లను ఎంచుకుంటారని ఆయన చెప్పారు. EC బృందం ఈ నెల ప్రారంభంలో రెండు రోజుల పాటు J&Kను సందర్శించింది. ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు సీనియర్ పోలీసు, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు.

ఐతే ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు, జిల్లా చీఫ్‌లు, J&K పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతితో సహా సీనియర్ పోలీసు అధికారులను పెద్ద ఎత్తున మార్చడం జరిగడంపై రాజకీయంగా కాక రేగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. అధికారుల బదిలీలు ఓవైపు, జమ్మూలోని అనేక జిల్లాలు తీవ్రవాద దాడులు మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019 నుండి EC జమ్ము, కాశ్మీ్ర్‌లో మూడుసార్లు సందర్శించింది. మునుపటి రెండు పర్యటనలు 2019, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగినవి. రెండు సార్లు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోల్ ప్యానెల్ నిరాకరించింది. ఈసీ ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

ఎన్నికల తేదీలను ఆయన స్వాగతించారు. అయితే ఈ ప్రాంతంలోని సీనియర్ పోలీసు అధికారులను మార్చడంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. “1987-88 తర్వాత దశలవారీగా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.. ఇదొక కొత్త అనుభవం. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నామని నేను చెప్పగలను…” అని ఆయన చెప్పారు. “ఈసీ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నొక్కి చెప్పింది… గత 24 గంటల్లో పోలీసుల బదిలీలపై ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. వారు గమనించాలి. ఇది కేంద్రానికి, బిజెపికి ప్రయోజనం చేకూర్చడానికి జరిగిందని మేము భయపడుతున్నాం.” అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఇదిలా ఉండగా, బిజెపి J&K ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ” ఎన్నికల ప్రకటన స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో, J&K ఆర్టికల్ 370 నుండి విముక్తి పొందింది. ప్రజలకు ప్రధాని మోదీపై విశ్వాసం ఉంది. బీజేపీ J&K ఎన్నికల్లో గెలుస్తుంది” అని చెప్పారు.

సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ రూలింగ్
ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు, J & K ను J&K మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. న్యాయస్థానం ఆర్టికల్ 370 నిర్ణయాన్ని సమర్థించింది. అయితే J&K ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉండటానికి, దాని రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని విభజించాలనే నిర్ణయాన్ని సమర్థించింది.