కేంద్రం అసమర్థత వల్ల రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయింది..
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రం అసమర్థత, వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, బీఆర్‌ఎస్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీఎస్డీపీ 5 లక్షల కోట్లు ఉండేదని.. ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. కానీ కేంద్రం సరిగా పరిపాలన చేయకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. తెలంగాణ వచ్చాక మెడికల్ కాలేజీలు 4 నుంచి 33కు పెరిగాయన్నారు. త్వరలోనే మహబూబాబాద్‌కు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్ పట్టణం అభివృద్ధికి 50 కోట్లు.. జిల్లాలోని మిగతా మున్సిపాలీటీలకు 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతీ గ్రామానికి 10 లక్షల నిధులిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. శాంతియుతంగా ఉంటేనే అభివృద్ది చెందుతుందని, మతపిచ్చితో రగిలిపోతే అంతా నాశనమే అవుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో ఆఫ్ఘానిస్తాన్ అవుతుందని, దీనిపై మత పెద్దలు, మేధావులు చర్చ జరపాలని సీఎం కేసీఆర్ సూచించారు.