మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం, జనవరి 12న తుది గణాంకాలను వెల్లడించింది. తాజా జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్త ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 26,80,014 మంది, పురుషులు 25,62,639 మంది మరియు ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
గణాంకాలను పరిశీలిస్తే, అత్యధిక ఓటర్లు కలిగిన కార్పొరేషన్‌గా నిజామాబాద్ నిలిచింది. ఇక్కడ 60 వార్డుల పరిధిలో మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ కార్పొరేషన్ నిలవగా, అత్యల్ప ఓటర్లు కలిగిన కార్పొరేషన్‌గా కొత్తగూడెం నమోదైంది. మున్సిపాలిటీల విషయానికి వస్తే, సూర్యాపేట 1,08,848 ఓటర్లతో ప్రథమ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ కేవలం 9,147 ఓటర్లతో కనిష్ట స్థాయిలో ఉంది.
తుది జాబితా ప్రచురణ ముగియడంతో ఇక తదుపరి ఘట్టం నోటిఫికేషన్ వైపు మళ్లింది. ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యమంత్రితో పాటు ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈనెల 16వ తేదీ నుంచే ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ లోపు ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. ఓటర్లు తమ పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

