స్థానిక పోరుకు రంగం సిద్ధం
తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 31 జిల్లాలలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో భాగంగా 31 జిల్లాలలో 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేసే జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5 వేలు, రిజర్వేషన్లు కలిగి ఉన్న అభ్యర్థి రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ కలిగి ఉన్న అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 11 వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి.. ఉపసంహరణకు ఈనెల 15 వరకు గడువు ఇవ్వనున్నారు. 23న పోలింగ్ ప్రక్రియ నిర్వహించి నవంబర్ 11న ఓట్ల లెక్కింపును పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు.
కాగా, రెండో విడత పరిషత్ ఎన్నికలకు గాను అక్టోబర్ 13న రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి.. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఇవ్వనున్నారు. 27న పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. రెండు విడతల పరిషత్ ఎన్నికల ఫలితాలను నవంబర్ 11నే వెల్లడించనున్నారు.