ఎమ్మెల్యే సంజయ్‌కు స్పీకర్ క్లీన్‌చిట్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పదవి గండం తప్పింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌తో పాటు, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు. అయితే, కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్‌లపై దాఖలైన పిటిషన్ల విచారణను మాత్రం ఫిబ్రవరి 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ తీర్పు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేనని స్పష్టం చేశారు. “నా జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు బీఆర్ఎస్ పార్టీ నిధికే కట్ అవుతున్నాయి, నేను ఆ పార్టీ సభ్యుడినేనని అఫిడవిట్ కూడా ఇచ్చాను” అని ఆయన వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే పార్టీ మారినట్లు కాదని, అనవసరమైన ఆరోపణలకు స్పీకర్ తీర్పుతో తెరపడిందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలు తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. దిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన వారు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాలయాపన చేస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి కాపాడే ప్రయత్నం జరుగుతోందని, తగిన ఆధారాలు ఉన్నప్పటికీ క్లీన్‌చిట్ ఇవ్వడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

