గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ షురూ
అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో చివరి దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా సెంట్రల్ గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను 93 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది. డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు తర్వాత డిసెంబర్ 8న జరగుతుంది. రెండో దశలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ (విరాంగమ్), ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకోర్ (గాంధీనగర్ సౌత్), మాజీ మంత్రి శంకర్ చౌదరి (తారద్) మరియు జిగ్నేష్ మేవానీ (వడ్గం) ఉన్నారు. బీజేపీ అభ్యర్థులుగా పటేల్, ఠాకూర్, చౌదరి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మేవానీ బరిలో ఉన్నారు.

ఈ దశ పోలింగ్‌లో కోటి 29 లక్షల పురుషులు, కోటి 22 లక్షల మంది మహిళలు సహా మొత్తం 59 లక్షల మంది మొదటిసారి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటు వేసారు. ప్రధాని సొంత రాష్ట్రం బిజెపికి కంచుకోటగా ఉంది. ఆ పార్టీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, కాంగ్రెస్‌లు పోటీలో ఉన్నప్పటికీ గెలుపుపై బీజేపీలో దీమా కన్పిస్తోంది. 2017లో, భారతీయ జనతా పార్టీ మొదటి దశ పోలింగ్‌లో 89 స్థానాలకు 48 స్థానాలను గెలుచుకుంది. రెండో దశలో 51 స్థానాలను కైవసం చేసుకుంది, దాని మొత్తం 182 స్థానాల్లో 99కి చేరుకుంది. 2017 ఎన్నికల్లో మొదటి దశలో 38, రెండో విడతలో 39 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

డిసెంబర్ 1న జరిగిన తొలి దశ ఓటింగ్‌లో 63.31% పోలింగ్ నమోదైంది. పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌కు హాజరు కావాలని… భారత ఎన్నికల సంఘం శనివారం ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. నవంబర్ 3 న ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుండి ప్రధాని మోదీ రాష్ట్రంలో 35 కి పైగా ర్యాలీలు నిర్వహించారు. డిసెంబర్ 1, 2న అహ్మదాబాద్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ రోడ్ షోలు నిర్వహించారు. 50 కిమీ రోడ్ షో ద్వారా 14 నియోజకవర్గాలను కవర్ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, స్మృతి ఇరానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రెండో విడతలో అధికార పార్టీ తరపున ప్రచారం చేశారు.

