Home Page SliderNational

అయోధ్యలోని రామ మందిరం ‘సూర్య తిలక్’ వేడుక వెనుక సైన్స్

Share with

ఈ రోజు మధ్యాహ్నం, అయోధ్యలోని గ్రాండ్ రామాలయం రామనవమి సందర్భంగా ‘సూర్య తిలకం’ వేడుక అట్టహాసంగా జరిగింది. సూర్యకాంతి కిరణంతో రామ్ లల్లా విగ్రహం నుదుటిపై అభిషేకం చేయడంతో విశిష్ట ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అత్యాధునిక శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగించి, 5.8 సెంటీమీటర్ల కాంతి పుంజం శ్రీరాముని నుదిటిపై తాకేలా చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారు. ఇందుకోసం ప్రత్యేక పరికరం రూపొందించారు. రామమందిరంలో ఉన్న పది మంది భారతీయ శాస్త్రవేత్తల బృందం రామనవమి సందర్భంగా ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి మూడున్నర నిమిషాలపాటు, అద్దాలు, లెన్స్‌ల కలయికను ఉపయోగించి సూర్యకాంతి కచ్చితంగా విగ్రహం నుదుటిపైకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ఆలయ ట్రస్ట్ ద్వారా నియమించబడిన, ప్రముఖ ప్రభుత్వ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అద్దాలు, లెన్స్‌లతో కూడిన అధునాతన ఉపకరణాన్ని రూపొందించారు. ఈ యంత్రాంగాన్ని అధికారికంగా ‘సూర్య తిలక్ మెకానిజం’ అని పిలుస్తారు. ఇది ఒక ముఖ్యమైన శాస్త్రీయ, ఇంజనీరింగ్ ఘనతను తెలియజేస్తుంది. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ CBRIలో సైంటిస్ట్, డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామచర్ల ఆప్టోమెకానికల్ సిస్టమ్ క్లిష్టమైన పనితీరును వివరించారు. “ఆప్టో-మెకానికల్ సిస్టమ్‌లో నాలుగు అద్దాలు టిల్ట్ మెకానిజం, పైపింగ్ సిస్టమ్‌ల లోపల అమర్చబడిన నాలుగు లెన్స్‌లు ఉంటాయి. అద్దాలు, లెన్స్‌ల ద్వారా సూర్యకిరణాలను గర్భానికి మళ్లించడానికి టిల్ట్ మెకానిజం కోసం సన్నదారిలో చిన్న హోల్ ద్వారా ప్రయోగం చేశాం” అని డాక్టర్ రామాచర్ల అన్నారు.

“చివరి కటకం, అద్దం శ్రీ రాముని నుదుటిపై సూర్యకిరణాలను తూర్పు వైపునకు కేంద్రీకరించేలా ఏర్పాట్లు చేశారు మొదటి అద్దం వంపుని సర్దుబాటు చేయడానికి వంపు మెకానిజం ఉపయోగించారు. సూర్య కిరణాలను ఉత్తరం వైపు 2వ అద్దం వైపునకు పంపి సూర్య తిలకం కన్పించేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని పైపులు, ఇతర భాగాలు ఇత్తడి మెటీరియల్‌తో తయారు చేశారు. పైపులు, ఎన్‌క్లోజర్‌లు లోపలి ఉపరితలాలు చాలా ఎక్కువ కాలం ఉండేలా మన్నికయ్యే వాటిని వినియోగించారు. సూర్యుని వేడి తరంగాలను విగ్రహం నుదిటిపై పడకుండా నిరోధించడానికి ఒక ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ గ్లాస్‌ను అమర్చారు.

‘సూర్య తిలక్’ మెకానిజం అభివృద్ధిలో CBRI, రూర్కీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIAP, బెంగళూరు శాస్త్రవేత్తల మధ్య సహకారం ఉంది. ప్రత్యేక గేర్‌బాక్స్‌ని ఉపయోగించడం, రిఫ్లెక్టివ్ మిర్రర్‌లు, లెన్స్‌లను ఉపయోగించడం ద్వారా, బృందం సోలార్ ట్రాకింగ్ సూత్రాలను ఉపయోగించి ఆలయం మూడో అంతస్తు నుండి లోపలి గర్భగుడి వరకు సూర్యకాంతి కిరణాల కచ్చితమైన అమరిక కోసం జాగ్రత్తలు తీసుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుండి సాంకేతిక సహకారం, బెంగళూరుకు చెందిన ఆప్టికా కంపెనీ తయారీ నైపుణ్యం ప్రాజెక్ట్ అమలుకు మరింత సహాయపడింది. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ చౌహాన్, ‘సూర్య తిలక్’ రామ్ లల్లా విగ్రహానికి సూర్యతిలక్ ఎలాంటి దోషం లేకుండా చేస్తున్నామని దీమాగా చెప్పారు. చంద్ర క్యాలెండర్ ఆధారంగా శ్రీరామనవమి నిర్ణీత తేదీని బట్టి, ఈ పవిత్రమైన ఆచారం సకాలంలో జరిగేలా విద్యుత్, బ్యాటరీలు లేదా ఇనుము ఆధారిత భాగాలపై ఆధారపడకుండా 19 గేర్‌లతో కూడిన క్లిష్టమైన ఏర్పాట్లు చేశారు.

ఖగోళ శాస్త్ర రంగంలో భారతదేశం ప్రధాన సంస్థ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), చంద్ర, సౌర (గ్రెగోరియన్) క్యాలెండర్‌ల మధ్య స్పష్టమైన అసమానతను పునరుద్దరించటానికి ఒక పరిష్కారాన్ని రూపొందించింది. “స్థాన ఖగోళ శాస్త్రంలో అవసరమైన నైపుణ్యం ఉంది” అని IIA డైరెక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం వివరించారు. “సూర్య తిలకం’ ద్వారా సూచించబడిన సూర్య కిరణాలు, రామ్ లాలా విగ్రహానికి వేడుకగా ప్రతి రామ నవమి నాడు అభిషేకం చేసేలా ఈ నైపుణ్యం ఉపయోగించబడుతుంది.” అని చెప్పారు. CSIR-CBRI బృందంలో డాక్టర్ SK పాణిగ్రాహి, డాక్టర్ RS బిష్త్, కాంతి సోలంకి, V. చక్రధర్, దినేష్, సమీర్ ఉన్నారు. CSIR-CBRI డైరెక్టర్ ప్రొఫెసర్ R. ప్రదీప్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌కు మార్గదర్శకత్వం వహించారు. IIA బెంగళూరు నుండి, డాక్టర్ అన్నపూర్ణి S. డైరెక్టర్, Er S శ్రీరామ్, ప్రొఫెసర్ తుషార్ ప్రభు కన్సల్టెంట్‌లుగా ఉన్నారు. ఆప్టికా మేనేజింగ్ డైరెక్టర్ Mr రాజిందర్ కొటారియా, బృందం నుంచి నాగరాజ్, వివేక్, థావ కుమార్ తదితరులు… అమలు, సంస్థాపన ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. ఇదే విధమైన ‘సూర్య తిలక్’ యంత్రాంగం ఇప్పటికే కొన్ని జైన దేవాలయాలలో కోణార్క్‌లోని సూర్య దేవాలయంలో ఉంది, కానీ అవి విభిన్నంగా రూపొందించబడ్డాయి.