దృశ్యం సినిమా తరహాలో హత్య..
కాన్పూర్ లో నాలుగు నెలల క్రితం కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త భార్య శవమై కనిపించింది. జిమ్ ట్రైనర్ తో ఆమెకున్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. ఆమెను చంపిన తర్వాత నిందితుడు.. శవం పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ప్రభుత్వ అధికారులు నివాసముండే భవన సముదాయాల సమీపంలో పూడ్చిపెట్టాడు.
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ కు చెందిన ఓ వ్యాపారవేత్త భార్య వారి నివాసానికి సమీపంలో ఉన్న ఓ జిమ్ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు జిమ్ ట్రైనర్ విమల్ సోనీతో పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ల పాటు వీరి మధ్య ఆ సాన్నిహిత్యం బాగానే నడిచింది. ఇటీవల అతనికి పెళ్లి నిశ్చయం కాగా.. సదరు మహిళ దానిని వ్యతిరేకించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. జిమ్ ట్రైనర్ ఆమె మెడపై కొట్టి చంపి.. శవాన్ని ప్రభుత్వ అధికారులకు కేటాయించిన బంగ్లాలు ఉన్న ప్రాంతంలో పూడ్చి పెట్టాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు నెలల నుంచి మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది నుంచి జిమ్ లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు.