‘మిషన్ కాకతీయ’ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, భారీ వరదలు వచ్చినా కూడా ఎక్కడా చెరువులు గండ్లు పడడం లేదు, దీనితో మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని పేర్కొన్నారు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సమీక్ష చేసి, ఈ విషయాన్ని వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యల గురించి వివరించారు. “భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాము. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని కోరాము. భద్రాచలం పట్టణంలో భారీ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నాం” అని పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం భారీ ఇన్ ఫ్లో కొనసాగుతోందని, ఉదయంతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గిందని తెలియజేశారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.