Andhra PradeshHome Page Slider

పవన్ కుమార్తెతో తిరుమలలో అన్యమత డిక్లరేషన్ ఇవ్వడం వెనుక రియల్ స్టోరీ

ఏదైనా చెప్పడం తేలికే. ఆచరించడమే కష్టం. కానీ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, సమాజంపై ప్రభావం చూపించే వారు ఇవన్నీ బేరీజు వేసుకొని మాత్రమే మాట్లాడతారు. వ్యవహరిస్తారు. అందుకే రూల్స్ విషయంలో ఎవరు పాటించినా, పాటించకపోయినా వాళ్లు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. ఇంట్లో ఏం చేసుకున్నా నాలుగు గోడల మధ్య ఎవరూ మాట్లాడరు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అవేవీ కుదరవు. ఏదైనా సరే ఒక పద్దతి ప్రకారం చేయాల్సిందే. జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇప్పుడు ఫుల్ స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. పదేళ్ల ప్రయాణంలో తొలుత టీడీపీకి మద్దతిచ్చినా, ఆ తర్వాత ఎన్నికల్లో చతికిలబడినా, ఆ తర్వాత టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి ఎన్నికల్లో విజయం సాధించినా ఆయన వ్యూహాలన్నీ కూడా వర్కౌటయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను తలకెత్తుకున్నారు. సీఎం చంద్రబాబునాయుడికి రియల్ సేనానిలా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలో ఒక్కొక్క వివాదం వచ్చి పడుతోంది. ఈ తరుణంలో తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారం సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కౌంటర్, పనిలో పనిగా పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఆ తర్వాత మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు అబ్జర్వేషన్ మొత్తంగా ఏపీలో ఆ అంశం రాజకీయంగా తిరుమల సాక్షిగా ఒకరకంగా చెప్పాలంటే మత ప్రాతిపదికకు బీజం వేసిందని చెప్పాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో సనాతన సంప్రదాయం పాటించే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా వ్యవహరించారు. ఆయన ఇంట్లో భిన్న మతాలు, కులాలకు నెలవైన వారు ఉన్నారన్నది మనందరికీ తెలిసిన విషయమే. హిందూ మతం గురించి, హిందూ మత పరిరక్షణ గురించి ఎవరైనా చెప్పినా, పవన్ కల్యాణ్ ఒక్కరే కొంచెం భిన్నంగా మాట్లాడటాన్ని మనం చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా హిందూమత సంస్కృతి, సనాతన సంప్రదాయంలో ఔన్యత్యాన్ని చెబుతున్నారు. పరమతాలను గౌరవిస్తూనే హిందూ మతాన్ని కూడా గౌరవించాల్సిన అవశ్యకతను ఆయన పదేపదే గుర్తు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసినా లడ్డూల్లో జంతువుల కొవ్వు వ్యవహారంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చసాగుతోంది. మొత్తం వ్యవహారానికి ఎవరు బాధ్యులు అన్న దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి చివరి రోజున కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఇద్దరు కుమార్తెలను స్వామి దర్శనానికి తీసుకెళ్లేందుకు ముందుగా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్, మూడో భార్య అన్నా లెజినోవాల సంతానం పొలెన అంజని కొణెదెలను, స్వామి దర్శనం కోసం తీసుకొచ్చారు. ఆమెకు బాప్టిస్ట్ ఆచారం ప్రకారం ఆచారాలు నిర్వహించామని పవన్ చెప్పేవారు. అందుకే ఇప్పుడు ఎలాంటి సమస్య రాకూడదని ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో, తండ్రి కూడా డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వివిధ కులాల వారు పెళ్లిళ్లు చేసుకోవడమన్నది చూస్తూనే ఉన్నాం. ఇక ఇతర దేశాల్లో ఉంటున్నవారిని మనోళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా సాధారణంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉభయులు రెండు రకాల పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదంతా అవసరమైనప్పుడు ఇష్యూగా, అవసరం లేనప్పుడు ఇష్యూ లేనట్టుగా సాగుతుంటోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం కాక ముందు అన్యమత డిక్లరేషన్ వ్యవహారం అంతగా ప్రాచూర్యంలోకి రాలేదు. ఆయన డిక్లరేషన్ ఫామ్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడూ ఇవ్వలేదు. గతంలో జాతీయనేతలు కొందరు టీటీడీ డిక్లరేషన్ తర్వాతే స్వామిని దర్శించుకున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే తాను ఐదేళ్లుగా స్వామికి సేవ చేశానని, తన తండ్రి కూడా స్వామికి పూజలు చేశారని, ఇప్పుడే అన్యమత డిక్లరేషన్ అంటూ కొత్త సంప్రదాయన్ని వెలుగులోకి తెస్తున్నారని జగన్ కూటమి నేతలపై విరుచుకుపడుతున్నారు. సీఎం కాక ముందు, సీఎం అయ్యాక ఎన్నడూ తాను డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదని చెప్పిన జగన్, తిరుమల పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మైనర్ బాలికకు సైతం డిక్లరేషన్ తీసుకోవడం వెనుక లెక్కలు వేరే ఉన్నాయన్న భావన ఉంది. వాస్తవానికి తిరుమల దర్శనానికి వెళ్లే 12 ఏళ్ల లోపు ఎలాంటి పిల్లలకు ఎలాంటి ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. కాకుంటే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారం ఇష్యూ కావడంతో ఇప్పుడిదంతా రాజకీయమవుతోందంతే. ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉండి, సొంత కుమార్తెకు పవన్ కల్యాణ్ డిక్లరేషన్ ఇస్తే, మిగతావారు కూడా ఎందుకివ్వరన్న ప్రశ్న ఉదయిస్తుంది.