Home Page SliderNational

ఢిల్లీని వదలని వానలు

దేశరాజధాని ఢిల్లీని వానలు వదలడం లేదు. నాలుగురోజులు విరామం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే యమునానది పోటెత్తడంతో వరద నీరు ఢిల్లీ నగరం మొత్తం వ్యాపించింది. ఎర్రకోట, సుప్రీంకోర్టు, పార్లమెంటు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం సహా మరిన్ని ముఖ్య ప్రాంతాలు, మార్కెట్ రోడ్లు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాలలో నీరు వెనక్కి తీసినా, భారీగా బురద మేటలు వేసింది. ఈ బురదను తొలగించడానికి ఢిల్లీ పారిశుద్ధ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాఠశాలలకు సెలవలు ప్రకటించడంతో కొంత వరకు ట్రాఫిక్ బెడద తగ్గింది. యమునానది నీటిమట్టం 208 నుండి 205 మీటర్లకు చేరుకోవడంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి వస్తున్నామనుకుంటే మళ్లీ వర్షాలు పడతాయనే వార్తలు రావడంతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు.