60 వేలకు చేరబోతున్న బంగారం ధర
బంగారం ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం బంగారం ధరలు 10 గ్రాముల ధర దాదాపు 60 వేల రూపాయలకు చేరుకుంటుందని ఆర్థిక వేత్తల అంచనా. ఆర్థికమాంద్యం కోరలు విప్పుతున్నవేళ బంగారమే సురక్షిత పెట్టుబడి మార్గమని అధికులు భావిస్తుండడమే దీనికి కారణం. ముఖ్యంగా భారతీయ కుటుంబాలకు బంగారం పరువు ప్రతిష్టలకు చిహ్నంగా భావిస్తారు. బంగారం దగ్గరుంటే మానసిక బలం ఉంటుందని నమ్ముతారు. బంగారానికి లిక్విడిటీ ఎక్కువ. అత్యవసరాలలో క్షణాలలో అమ్ముకునే అవకాశం ఉంది. దానికి తోడు ప్రభుత్వం తీసుకోబోయే పన్ను విధింపు విధానాలలో బంగారానికి టాక్స్ పెరిగే అవకాశం ఉంది. దీనితో చాలామంది ఈ మధ్యకాలంలో బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో కూడా బంగారం షేర్లదే పెద్దమొత్తంగా ఉంది.

గత రెండేళ్ల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. కరోనా కాలానికి ముందు 2020లో 3000 రూపాయలు ఉండే గ్రాము బంగారం ధర ఇప్పుడు 5000 రూపాయలు దాటింది. అంటే దాదాపు 30 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్భణం కూడా ఈ పెరుగుదలకు ఓ కారణం. పైగా ఇప్పుడు బంగారంలో పెట్టుబడులు పెట్టాలనే వారికి గోల్డ్ బాండ్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చిన్నచిన్న మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.