జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది
సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇక సాయంత్రం మాచర్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం షేక్ అంజద్ బాషా, ఎంపీ నందిగం సురేష్, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, రవిబాబు, చంద్రగిరి ఏసురత్నం, సునీత, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
రూ.22,423 కోట్ల సంక్షేమం మాచర్లలో జరిగింది – ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
గడిచిన నాలుగున్నర ఏళ్ల నుంచి రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మాచర్ల ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా చేయి పట్టుకుని వైఎస్సార్‌సీపీ నడిపిస్తోందని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి నాయకత్వంలో పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పిన్నెల్లి తెలిపారు.

అణగారినవర్గాలు సాధికారత సాధించాయి – ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఈ రాష్ట్రంలో సీఎం జగన్ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారతకు కృషి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు.. రాష్ట్రానికి వెన్నెముక అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్ తెలిపారు. ఈ సామాజిక వర్గాలకు అర్థశాతం మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అనేక పదవులను కట్టబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం అలాంటి అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అనిల్ తెలిపారు. అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అన్నారు. వచ్చే అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి, సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనలేక చాలా మంది కలిసి వస్తున్నారు. వారందరికీ ప్రజలు బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే అనిల్ కోరారు. ఎవరైనా తాను గెలవాలని పార్టీ పెడతారు, కానీ ప్రపంచంలోనే పక్కనోళ్లని గెలిపించడానికి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కల్యాణ్ అని, అలాంటి వ్యక్తి వచ్చి సీఎం జగన్‌ను ఓడిస్తామని పిచ్చి ప్రేలాపణలు పలుకుతున్నాడని, జగన్‌ను ఓడించడం ఎవరితరం కాదని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే నిజం గెలిచిందని లోకేష్ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడని, చంద్రబాబు రోగాలు నయం చేసుకోవడానికి జైలు నుంచి వచ్చారని, త్వరలోనే జైల్లోకి మళ్లీ వెళ్తారని ఆయన తెలిపారు. మాచర్ల ప్రజలు మరోసారి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

దళితులంటే చంద్రబాబుకు ఇష్టం లేదు. – ఎంపీ నందిగం సురేష్
చంద్రబాబు నిత్యం పెత్తందారుల గురించి ఆలోచిస్తారని, సీఎం జగన్ మాత్రం పేదల కోసం, వారి సంక్షేమం కోసం నిత్యం ఆలోచిస్తారని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అబద్దాలు చెప్పి పబ్బంగడపుకుంటారని ఎంపీ ఆరోపించారు. దళితుల పిల్లలు మంచిగా చదువుకోకూడదని, వారెప్పుడూ బానిసలుగా ఉండాలని చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టులకు వెళ్లారని, ఇక అమరావతిలో ఇళ్ల స్థలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు ఓర్వలేకపోయి.. కోర్టులో కేసులు వేశారని ఎంపీ సురేష్ విమర్శించారు.

