ప్రజల నమ్మకమే ప్రభుత్వ బలం
రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు. రూపురేఖలు మారిన దమ్మపేట ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి అధికారికంగా ప్రారంభించారు.ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రజల నమ్మకమే తమకు అసలైన బలమని కొనియాడారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం మేర కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించి ప్రజలు తమ పాలనపై ముద్ర వేశారని గుర్తు చేశారు. ఇదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు.
ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని, కాకతీయుల కాలం నాటి రాతి నిర్మాణాల తరహాలో, సుమారు 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని విధంగా శాశ్వత కట్టడాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వస్తున్నారని, 19న అక్కడ పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

