BusinessHome Page SliderNationalNewsTrending Today

టైమ్ జాబితాలోకెక్కిన ఏకైక ఇండియన్ సోషల్ మీడియా స్టార్..

టైమ్ పత్రిక తొలిసారిగా ‘టైమ్ – 100 క్రియేటర్స్ లిస్టు’ను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ పేర్లు ఎంపిక చేసి ఇందులో చోటిచ్చింది. ఈ జాబితాలో భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ప్రజక్తా కోలీ స్థానం సంపాదించింది. మన దేశం నుంచి ఈ జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న ఆమె.. మెల్ రాబిన్స్, మిస్టర్ బీస్ట్, జై శెట్టి, జో రోగన్.. వంటి గ్లోబల్ డిజిటల్ స్టార్ సరసన నిలవడం గొప్ప అనుభూతి అంటోంది. ‘ప్రస్తుతం నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నన్ను ప్రోత్సహించిన నా కుటుంబానికి, ఆదరిస్తోన్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు. ఎలాంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా కేవలం నన్ను నేను నమ్ముకొని ఈ రంగంలోకొచ్చా.. సక్సెస్ సాధించా!’ అంటూ ఇన్ స్టా పోస్ట్ రూపంలో తన ఆనందాన్ని పంచుకుంది ప్రజక్త. మిచెల్ ఒబామాతో కలిసి బాలికల విద్య కోసం తన యూట్యూబ్ ఛానల్ వేదికగా కృషి చేసిన ఆమె.. మన దేశం నుంచి యూఎన్డీపీ ఎంపిక చేసిన తొలి ‘యూత్ క్లైమేట్ ఛాంపియన్’గా నిలిచింది. అంతేకాదు.. పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని.. ఆయా సామాజిక సమస్యలపై ప్రసంగిస్తుంటుంది కూడా! ఇలా తన ప్రతిభాపాటవాలు, సమాజ సేవతో ఇటు దేశవ్యాప్తంగా, అటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సోషల్ బ్యూటీ.. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’, జీక్యూ ఇండియా ‘అత్యంత ప్రభావంతమైన యువ భారతీయులు’.. జాబితాల్లో చోటుదక్కించుకుంది. ప్రస్తుతం ప్రజక్తకు యూట్యూబ్లో 72.9 లక్షల మంది సబ్ స్క్రైబర్లు, ఇన్స్టాలో 87 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ స్టార్ గా నిలిచింది