Home Page SliderNational

రెట్టింపు బలంతో విజృంభిస్తోన్న కరోనా కొత్తవేరియంట్..తట్టుకోలేం

రెట్టింపు బలంతో కరోనా కొత్తవేరియంట్ విజృంభిస్తోందని, అదే జరిగితే తట్టుకోలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 358 కేసులు నమోదయితే అందులో కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. కరోనాతో నిన్న 6గురు మరణించారు. దేశవ్యాప్తంగా 2,668 కేసులు నమోదయ్యాయి. 2019లో కరోనా అంటే ఒక హడల్. కరోనా వచ్చిన వారిని చూస్తే భయం. కరోనా తగ్గినా కూడా వారి వద్దకు వెళ్లడానికి సంకోచం. ఈ భయం దాదాపు 2022 దాకా కొనసాగింది. కానీ ఇప్పుడు అవేవీ లేవు.  వాక్సిన్స్ వచ్చాక, అందరూ వాక్సిన్ వేయించుకున్నాక దాదాపు కరోనాని మరిచిపోయారు. ఎవ్వరూ కరోనాని పట్టించుకోవడం లేదు.

కరోనా రెండవదశలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకం జేఎన్.1 భారత్‌లో విజృంభిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తి దశలోకి చేరిందని వైద్యులు  పేర్కొన్నారు. అక్టోబర్ వరకూ 1 శాతం మాత్రమే ఉన్న కరోనా కేసులు నవంబర్  పూర్తయినప్పటి నుండి 9 శాతానికి చేరాయి. నెలరోజులు తిరక్కుండానే 30 శాతానికి పెరిగిపోయాయి. భారత్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కొత్త వేరియంట్లు బయటపడుతున్నాయి. దీనితో కొవిడ్‌ను తేలికగా తీసుకోవద్దని, వెంటనే టెస్టులు, చికిత్సలు చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు, వృద్ధులు, రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని కొవిడ్ నియమాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. వ్యాధిలక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.