NewsTelangana

పేరు మార్పు.. ఎన్టీయార్‌ అభిమానులను అవమానించడమే..

ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీయార్‌ పేరు మార్చి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం సరికాదని వైస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అభిప్రాయపడ్డారు. ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఓ పెద్ద మనిషి పేరు పెట్టిందని.. ఇప్పుడు మరో ప్రభుత్వం వచ్చి ఆ పెద్ద మనిషి పేరును తొలగించి.. మరో పెద్ద మనిషి పేరు పెట్టడం తగదన్నారు. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చే ఇంకో ప్రభుత్వం ఆ పేరును తొలగించి ఇంకో పేరు పెడితే.. అప్పుడు ఈయనకు అవమానం జరిగినట్లు కాదా..? అని లాజిక్‌ లేవనెత్తారు. ఎన్టీయార్‌కు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారని.. ఆయన పేరును తొలగిస్తే ఎన్టీయార్‌ అభిమానులను అవమానించినట్లేనని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ నన్నే ఎక్కువ ప్రేమించారు..

నిజానికి.. వైఎస్సార్‌ తనను ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించలేదని.. ఆయనను తాను ఆరాధించినట్లు ఇంకెవరూ ఆరాధించలేదని వైఎస్‌ షర్మిల చెప్పుకున్నారు. మరొకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్‌కు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. వైఎస్‌కు ఉన్న పేరు చరిత్రలో మరెవరికీ లేదని.. ఆయన చనిపోతే 700 మంది గుండెలు ఆగిపోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగపల్లి గ్రామంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షర్మిల పైవిధంగా స్పందించారు.