పసివాడి ప్రాణం మీదకు తెచ్చిన తల్లి రీల్స్ పిచ్చి..
బిడ్డలను ప్రాణప్రదంగా చూసుకుంటారు తల్లులు. అమ్మ దగ్గరుంటే చాలు పిల్లలు ఎంతో ధైర్యంగా ఉంటారు. కానీ ఒక వీడియోలో ఒక పసివాడికి తల్లి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక చిన్నపిల్లవాడిని ప్రమాదకర పరిస్థితిలో పెట్టి ప్రాణాల మీదకు తెచ్చిన తల్లి రీల్స్ పిచ్చిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో నిండా పదేళ్లు కూడా లేని ఒక పిల్లాడిని ఒక చేత్తే పట్టుకుని లోతైన బావిపై కూర్చుని రీల్స్ చేస్తోంది ఆ తల్లి. అది కూడా పిల్లాడిని బావి లోపలి వైపుకు పెట్టి, పాటకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శిస్తోంది. ఈ వీడియోలో పిల్లవాడు భయంతో గిలగిలా కొట్టుకోవడం కనిపిస్తోంది. రీల్స్ కోసం ఈమె చేసిన పనికి అందరూ విమర్శిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిదో తెలియక, ఆమెను అరెస్టు చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. విచ్చలవిడిగా మారిన సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల్లో కనీస మానవత్వం కనుమరుగయిపోతోందని దుమ్మెత్తి పోస్తున్నారు.