తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
• పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు, శిబిరాలు ఏర్పాటు
• ఏడు స్థానాలకు 8 మంది పోటీ
• విజయవాడలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో గురువారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలలోను తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఏడు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో చివరిదైన ఏడో స్థానం కోసం రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారే ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలని పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాత్రి రాజకీయ రాజధాని విజయవాడ కేంద్రంగా రాజకీయ శిబిరాలను ఇరు పార్టీలు ఏర్పాటు చేశాయి. అధికార వైఎస్ఆర్సిపీ మూడు క్యాంపులను ఏర్పాటు చేయగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఒక క్యాంపును ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్సిపీ ప్రాంతాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో ఒక శిబిరం, రాయలసీమ ప్రాంత శాసనసభ్యులతో మరొక శిబిరం, కోస్తా జిల్లాల శాసనసభ్యులతో మరో క్యాంపును ఏర్పాటు చేసింది. ఆయా శిబిరాలకు సీనియర్ నేతలు, మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారు.

ఇదే సందర్భంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ తమ శాసనసభ్యులతో శిబిరాన్ని ఏర్పాటు చేసి గురువారం నాటి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంఖ్యా బలం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీంతో విజయవాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక్కో ఎమ్మెల్సీ విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. ఆ లెక్కన ఆరు స్థానాలు వైఎస్ఆర్సిపీ సునాయాసంగా గెలుపొందనుంది. సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఏడో స్థానం తెలుగుదేశం పార్టీకి రావాల్సి ఉన్నప్పటికీ నలుగురు శాసనసభ్యులు వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో 23 మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ బలం 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన మరొక ఓటు అవసరం ఉంది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్సిపీకి కూడా మరో ఓటు అవసరం ఉంది. దీంతో ఆ ఒక్క ఓటు కోసం రెండు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. అధికార వైఎస్ఆర్సిపికీ అసంతృప్తి ఎమ్మెల్యేల తలపోటు వేధిస్తోంది.

గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో అధికారులు అత్యంత పకడ్బందీగా పోలింగ్ నిర్వహించబోతున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం వెంటనే కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది. 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా వైఎస్సార్సీపీ నుంచి ఏడుగురు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు వంతున మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆ ఒక స్థానంపై తెలుగుదేశం పార్టీ వైఎస్సార్సీపీలు ఎవరికి వారే గెలిచి తమపట్టు నిలుపుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సీఎం జగన్ ఏడు స్థానాలు గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు కూడా తమకు బలం ఉన్న ఏడో స్థానంలో గెలుపొంది ఒక ఎమ్మెల్సీని సొంతం చేసుకోవాలని పావుల కలుపుతున్నారు. మరి ఆ ఒక్క స్థానం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.