భారీగా నష్టపోయిన మార్కెట్… రూ. 2.85 లక్షల కోట్లు ఆవిరి!
వరుసగా 8 రోజుల నుండి లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్కు ఈ రోజు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనతలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. జూన్లో నమోదైన కనిష్టాల నుంచి నిఫ్టీ ఇప్పటి వరకు 18 శాతం ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారని నిపుణుల అభిప్రాయం.
మధ్యాహ్నం సెషన్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు చేరింది. చివరికి సెన్సెక్స్ 651 పాయింట్ల నష్టంతో 59,646 వద్ద నిఫ్టీ 198 పాయింట్లు కుప్పకూలి 17,758 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు, నష్టపోగా ఐటీ జోరు కొనసాగింది. అలాగే ఇండెక్స్ హేవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఐటీ షేర్లు మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఈ రోజు బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. డాలరు ముగిసే సమయానికి రూ. 79.79 వద్ద నిలిచింది. మరోవైపు.. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు వల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ… రేట్ల పెంపు ఇంకా కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలూ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు.. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై తాజాగా పెంచిన ఎగుమతి సుంకం కూడా సూచీలను ప్రభావితం చేసింది.

