మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు..
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) అందెశ్రీ తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
అందెశ్రీ ప్రస్థానం ..1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల రూ.కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం పొందారు. 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం సాధించారు. 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు. లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు.
అందెశ్రీ మృతిపై గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని.. కానీ గత కొద్దిరోజులుగా ఆయన మందులు వాడటం లేదని గాంధీ ఆస్పత్రి హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం 7:30 గంటలకు అందెశ్రీని కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని సునీల్ కుమార్ తెలిపారు. బ్రాట్ డెడ్‌గా వైద్యులు డిక్లేర్ చేసినట్లు చెప్పారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే అందెశ్రీ చనిపోయినట్లు వెల్లడించారు. అందెశ్రీకి గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ ఉందని… అయితే ఒక నెలరోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని తెలిపారు. ఆయనకు ఆయాసం ఉందని, చెస్ట్ డిస్‌కంఫర్టబుల్ ఉందన్నారు. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. గత రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని తెలిపారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని అన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని.. ఉదయం 6:20 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు అందెశ్రీని గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు అందెశ్రీ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్, తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అందెశ్రీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

