యువతులను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై గ్రామస్థుల నిరసన
మేడ్చల్ కలెక్టరేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు యువతులను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలుకావడంతో వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి(21), భవానీ(21)లుగా పోలీసులు గుర్తించారు. అయితే మూడు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన బత్తుల పెంటయ్య (69)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. దీంతో ఇదే ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అక్కడి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. టైర్లు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.