Home Page SliderTelangana

కిడ్నాప్‌ కలకలం… సినిమా ఫక్కీలో 100 మందితో వచ్చి….

సినిమా స్టైయిల్‌లో 100 మంది యువకులు వచ్చి ఓ యువతి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో  జరిగింది. తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలోని రాగన్నగూడలో నివసిస్తున్న వైశాలి అనే యువతి.. డెంటల్‌ డాక్టర్‌గా పని చేస్తోంది. 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. ఆడ్డు వచ్చినవారిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులపై, పక్కింటి వ్యక్తులపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని కిడ్నాప్‌ చేసింది మిస్టర్‌ టీ ఫ్రాంచైజీ ఓనర్‌ నవీన్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 100 మంది యువకులు ఇంటికి వచ్చి తన కూతురు వైశాలిని కిడ్నాప్‌ చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. యువతి కిడ్నాప్‌ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. నవీన్‌ రెడ్డి, వైశాలి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్ళికి వైశాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంత కాలంగా యువతి అతనికి  దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్‌ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. వివాహ సంబంధం కోసం మరో పెళ్ళి వారు వైశాలి ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టి నవీన్‌ రెడ్డి యువతీ ఇంటికి వెళ్లి 100 మంది యువకుల సహాయంతో ఆమెను కిడ్నాప్‌ చేశాడు. ఈ ఘటనపై యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.