Home Page SliderNational

పాక్‌పై భారత్ ఘనవిజయానికి ప్రతీక ఈ ‘కార్గిల్ విజయదివస్’

1999లో పాకిస్తాన్ నుండి భారత్ తిరిగి కార్గిల్‌ను హస్తగతం చేసుకున్న శుభసందర్భంలో ఈ కార్గిల్ విజయదివస్‌ను జరుపుకుంటున్నాము. భారత సైనికుల ఘన విజయానికి ప్రతీక ఈ రోజు. సైనికుల త్యాగనిరతికి, ధైర్యానికి గుర్తుగా (జూలై 26)ను నేడు 24వ కార్గిల్ విజయ దివస్‌ను జరుపుకుంటున్నాము. ప్రధాని మోదీ తన హృదయాంతరాలలోనుండి నాటి త్యాగవీరులను స్మరించుకుంటున్నానని, వారెప్పుడూ భారత ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్విటర్‌లో పేర్కొన్నారు. 1999 మే నెలలో జమ్ముకాశ్మీర్‌లో గల కార్గిల్ ప్రాంతాన్ని పాక్ సైనికులు ఆక్రమించుకున్నారు. దీనితో అప్రమత్తమైన భారత ప్రభుత్వ ఆదేశాలతో 1999 మే నుండి జూలై వరకూ ఈ యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ భాత్రా, లెఫ్టనెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేశ్ సింగ్ అధికారి, వివేక్ గుప్తా వంటి ఉన్నతాధికారులతో సహా మొత్తం 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.

వారందరి త్యాగాన్ని పునస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఈ రోజును ‘కార్గిల్ వార్ మెమొరియల్ దివస్‌’ను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ కార్గిల్ జిల్లాలోని  లఢక్ వద్ద గల ‘వార్ మెమొరియల్’ వద్ద కార్గిల్ యుద్ధంలో చనిపోయిన  సైనికులకు నివాళులు అర్పించనున్నారు. అలాగే భారత త్రిదళాలకు చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఢిఫెన్స్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ల్, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్  కూడా తమ తమ దళాలతో  ఈ మెమొరియల్ వద్ద కార్గిల్ యుద్ధ వీరులకు గౌరవ వందనం సమర్పిస్తారు.