రాహుల్ వ్యాఖ్యల అంశం పరువు నష్టం కలిగించేంత పెద్దది కాదు…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ఉంటుందని ఖర్గే వెల్లడించారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామన్నారు. నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తున్నారని విమర్శలు గుప్పించారు.