లలిత్ మోదీ, మాల్యా సెటైర్లపై భారత ప్రభుత్వం స్పందన
భారతదేశం నుంచి పరారైన అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరారీలో ఉన్న లలిత్ మోదీ, విజయ్ మాల్యాలను స్వదేశానికి తీసుకొచ్చి, చట్ట ప్రకారం శిక్షపడేలా చేస్తామని ఒక ప్రకటన చేసింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్,అప్పుల ఎగవేత ఆరోపణలతో 2010లో లలిత్ మోదీ, 2016లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్ విజయ్ మాల్యా, భారతదేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయారు. ఆయనను 2019లో పరారీలో ఉన్న లలిత్ మోదీ, విజయ్ మాల్యాలను ఆర్థిక నేరస్థులుగా కేంద్రం ప్రకటించగా, వీరిద్దరూ ప్రస్తుతం యూకేలో దర్జాగా తిరుగుతున్నారు. గతవారం లండన్‌లో విజయ్‌మాల్యా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఈ వేడుకలకు హాజరైన లలిత్ మోదీ, విజయ్ మాల్యాతో కలిసి వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, మేము భారత్ నుంచి పరారైన అతిపెద్ద నేరస్థులం, ఈ వీడియో చూసి అసూయతో మీ గుండెలు మండిపోనివ్వండంటూ క్యాప్షన్ పెట్టారు.శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియోపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిచ్చారు. భారతదేశంలో చట్టాల నుంచి తప్పించుకుని, పరారీలో ఉన్న వ్యక్తులందరినీ దేశానికి తిరిగి తీసుకురావడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో మేము అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియలు కొనసాగుతున్నాయన్నారు.ఈ కేసులలో అనేక చట్టపరమైన అంశాలున్నాయి, కానీ వారిని ఇక్కడ కోర్టులలో విచారణకు హాజరుపరచడానికి, మేము వారిని తిరిగి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

