పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే!
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ సోమవారం జరిగింది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. పిటిషనర్లు దాఖలు చేసిన రిప్లైపై లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోరగా, ఇందుకు అంగీకరించిన హైకోర్టు, ఫిబ్రవరి 20వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తన తుది వివరణ సమర్పించిన తర్వాత, ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో కేసీఆర్, హరీశ్ రావు సహా ఇతర అధికారులకు ప్రస్తుతానికి న్యాయస్థానంలో ఊరట లభించినట్లయింది.

