దేశ ప్రధాని పెద్దన్నలాంటోడు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన స్ట్రెచర్ వ్యాఖ్యలు ఎక్స్ వేదికగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.కేసిఆర్ ని ఉద్దేశ్యించి …స్ట్రెచర్ మీదున్నోళ్లు రేపు మార్చురీకి పోతారన్న మాటలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను సీఎం అయ్యాక 32 సార్లు ఢిల్లీ వెళ్ళానని ఆ సమయంలో 3 సార్లు ప్రధానని కలిశానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డిని ఢిల్లీలో 4 సార్లు కలిశానన్నారు. ఇతర మంత్రులను చాలా సార్లు కలిశానని చెప్పుకొచ్చారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండటం నేరం కాదన్నారు.తెలంగాణ అభివృద్దికి నిధులు అడగడం తప్పుకాదని సమర్ధించుకున్నారు. కేంద్రంతో మాట్లాడితే బీ.ఆర్.ఎస్.పార్టీకి ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు.స్ట్రెచర్ మీదున్న బీ.ఆర్.ఎస్.పార్టీ త్వరలోనే మార్చురీకి వెళ్తుంది అని అన్నానే తప్ప…కేసిఆర్ గురించి కాదని సీఎం వివరణ ఇచ్చారు.కానీ తనపై ఎక్స్ వేదికగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ప్రధాని అనే వ్యక్తి పెద్దన్నలాంటోడని అలాంటి వ్యక్తిని కలిస్తే తప్పెలా అవుందన్నారు.కేసుల మాఫీ కోసం చీకట్లో కాళ్లు పట్టుకున్నారని….కానీ తెలంగాణ నిధుల కోసం తాను పట్టపగలే కలిశానని చెప్పారు.