వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ..
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు ఐదు లక్షలమంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేలసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసుభాగం వెనుక నుంచీ నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మరుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

