కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది
- ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
- ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని హెచ్చరిక
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు కొత్త వాహనాలపై ప్రభుత్వం పెంచిన జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)పై తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు పన్నుల భారం మోపడం తగదని స్పష్టం చేశారు.కేసీఆర్ హయాంలో పన్నులు తగ్గించారని, అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు పెరుగుతున్నాయని విమర్శించారు. గత నెలలో వాహనాలపై సర్వీస్ ట్యాక్స్ పెంచారని, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ పెంపుతో ప్రజలపై మరింత భారం పడుతోందని అన్నారు. ఈ రెండు నిర్ణయాల వల్ల ప్రజలపై దాదాపు రూ.2 వేల కోట్ల అదనపు భారమోపబడిందని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వాహనం అవసరమైపోయిన ఈ కాలంలో ప్రభుత్వం ఇలాంటి పన్ను భారాలు మోపడం సరికాదని అన్నారు. అదనంగా, రోడ్ల నిర్మాణం పేరుతో సేకరించే పన్ను మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.