NewsTelangana

జింఖానా తొక్కిసలాటపై ప్రభుత్వం సీరియస్‌

భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం టికెట్లు విక్రయించిన జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తొక్కిసలాటపై వాస్తవ వివరాలు ఇవ్వాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)ను ప్రభుత్వం ఆదేశించింది. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయంపై పూర్తి సమాచారంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ రావాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు. మంత్రి గురువారం ఉప్పల్‌ స్టేడియాన్ని సందర్శించారు. క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజారిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

టికెట్ల విక్రయం కోసం హెచ్‌సీఏ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ చౌహాన్‌ తెలిపారు. గాయపడిన వారికి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. తొక్కిసలాటకు కారణమైన హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. టికెట్ల విక్రయం సమాచారం తమకు ఇవ్వలేదని, తమ సాయం తీసుకుంటే ఇలా జరగకపోయేదని పేర్కొన్నారు.