పారా ఒలింపిక్ పతకమే ధ్యేయం
“ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని” నిరూపించాడు అమర్ సాయినాథ్. అతనికి చిన్నవయస్సు నుండే క్రీడలంటే చాలా ఇష్టం. కానీ ఐదేళ్లవయస్సులోనే ప్రమాదంలో ఒకచేయి కోల్పోయారు. అయినా పట్టుదల కోల్పోలేదు. ఒకవైపు చదువుకుంటూనే మరోప్రక్క క్రీడలపై పట్టు సాధించారు. తల్లిదండ్రులు కూడా అతని పట్టుదలకు తలొగ్గేరు. కర్నూలు జిల్లాకు చెందిన అమర్ సాయినాథ్ ఐదేళ్లవయస్సులో మెట్లపై నుండి పడిపోయి, చేయి విరగిపోవడంతో కట్టు కట్టారు. కానీ ఇన్‌ఫెక్షన్ అవడంతో చేయి తీసివేయవలసి వచ్చింది. అయినా ధైర్యం కోల్పోకుండా కష్టపడి చదువుతూ, మరోవైపు క్రీడల్లో కూడా సాధన చేశారు. క్రిందటి సంవత్సరమే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అమర్ సాయినాథ్‌కు చెన్నైలోని టీసీఎస్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ రెండు షిఫ్టుల్లో పనివల్ల అతనికి ఇష్టమైన క్రీడల సాధనకు సమయం చిక్కలేదు. దానితో కేవలం నాలుగు నెలల్లో దానికి రాజీనామా చేసి, పూర్తిగా అథ్లెటిక్స్ బాట పట్టాడు. పారా ఒలింపిక్స్ లో గెలుపే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఖడక్ సింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు.

గత సంవత్సరం రాష్ట్రస్థాయి పరుగు, షూటింగ్ విభాగాల్లో రజత పతకాలు సాధించారు. అలాగే జాతీయస్థాయి పెంటాథలాన్ పోటీలో ఏపీ తరపున పాల్గొన్నారు. పరుగు పందేలు, షూటింగ్‌లో కూడా వెండి పతకాలు వరించాయి. దీనితో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాగైనా పారా ఒలింపిక్స్ పతకం సాధించాలనే కోరిక బలపడింది. మొన్న వైజాగ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో కూడా రజత పతకం పొందారు.

