కేసీఆర్‌పై తొలి కేసు పెట్టాలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందనే భయం కల్వకుంట్ర కుటుంబానికి పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని.. ఈ వివాదంలో తొలి కేసు కేసీఆర్‌పైనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల భయంతో సీఎం కేసీఆర్ ఎన్నో కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. ఫాంహౌస్‌కు పోలీసులు వెళ్లక ముందే టీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు సిద్ధమవడం ఏమిటని ప్రశ్నించారు. ఆరు నెలల్లో పడిపోయే ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేనేలేదని.. అధికారం కోసం 2023 వరకూ ఆగుతామని స్పష్టం చేశారు. పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకున్నారని.. శాసన మండలిలో కూడా కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేయలేదా.. అని కిషన్ రెడ్డి అడిగారు.