‘కాలిఫోర్నియా నగరాన్ని తాకిన కార్చిచ్చు’..వేలమంది తరలింపు
అమెరికాలోని కాలిఫోర్నియా నగరాన్ని కూడా కార్చిచ్చు వేడి సెగలు తాకాయి. ఈ రాష్ట్రంలోని దక్షిణభాగంలో ఉన్న లైన్‌ఫైర్ ఇప్పటికే శాన్ బెర్నార్డినో కౌంటీలో 20 వేల ఎకరాలకు పైన బూడిద చేసింది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే దాదాపు 600 మంది అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్నారు. అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగుపాటు కారణంగా కార్చిచ్చు మొదలయ్యిందని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. దీనికితోడు గాలులు బలంగా వీయడంతో తీవ్రరూపం దాల్చి, 14 రెట్లు పెరిగిపోయింది. ఇదే సమయంలో అక్కడ స్వల్పంగా భూమి కూడా కంపించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో స్కూళ్లు, హైవేలు మూసివేశారు. దాదాపు 35 వేల ఇళ్లు ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్‌యారో హెడ్, వ్యాలీ ఆఫ్ ఎన్‌క్యాచ్‌మెంట్, క్రిస్ట్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ ప్రాంతాలలో ఎమర్జెన్సీ నెలకొంది. అక్కడి గవర్నర్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోపక్క నెవాడ రాష్ట్రాన్ని కూడా అత్యవసర పరిస్థితి విధించారు. ఇక్కడ వాజ్‌హో కౌంటీ, వైట్ పవర్ కౌంటీల నుండి వేలమందిని ఖాలీ చేయించారు. అక్కడ కూడా ఏడువేల ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమయ్యింది.

