బీజేపీపై పోరుకు కొత్త పేరుతో రానున్న ‘యూపీఏ’
కాంగ్రెస్ ప్రధాన పార్టీగా అనేక మిత్ర పార్టీల కలయికతో ఏర్పడిన యూపీఏ తన పేరు మార్చుకుని బీజేపీపై యుద్ధానికి సిద్ధం కానుంది. 2004లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ అనే పేరుతో కూటమి ఏర్పాటయ్యింది. దీనిలో కాంగ్రెస్ మేజర్ పార్టీగా నాయకత్వం వహించింది. ఈ అలయెన్స్ 2004లో సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పడింది. 2004-2014 మధ్య రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014 నుండి డీలా పడిన ఈ కూటమిని బలోపేతం చేయడానికి ఇప్పుడు బెంగళూరులో తాజ్ వెస్ట్ హోటల్‌లో జరగనున్న విపక్షాల భేటిలో పేరుమార్పుకి సిద్ధపడ్డారు. సోమ, మంగళ వారాలలో ఈ భేటీలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ పేరు మార్పుపై సానుకూలతతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న ఈ కూటమి 2024లో గెలుపే లక్ష్యంగా రకరకాల వ్యూహాలతో, పథకాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. 2024 ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో సరికొత్త పేరుతో ప్రజల ముందుకు రాబోతోంది. కర్ణాటక ఎన్నికలలో సాధించిన ఘనవిజయం దీనికి మరింత ఉత్సాహాన్ని అందించింది.