సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధం
రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నెల నుంచి నెలకు ఆరు కేజీల సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని సుమారు 84 శాతం మంది ప్రజలు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. గతంలో రేషన్ ద్వారా అందజేసిన దొడ్డు బియ్యం (మోట బియ్యం) ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో, దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. కానీ సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రజల ఆహార భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.