NationalNews

డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. నగరంలోని ప్రధాన సర్కిల్‌లో రెడ్‌లైట్‌ వేసి ఉండటంతో వాహనాలంతా నిలిచిపోయాయి. వెనక నుంచి దూసుకొచ్చిన ఓ సిటీ బస్సు ముందున్న వాహనాలపైకి అకస్మాత్తుగా దూసుకెళ్లింది. దీంతో వాహనాలు, వాహనదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ద్విచక్ర వాహనదారులు, ఒక ఆటో రిక్షా, కారు ప్రమాదానికి గురయ్యాయి. ద్విచక్ర వాహనాలను కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది.

వాహనాలు కూడా బస్సు కింద పడకుండా.. పక్కన పడటంతో వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇంతకూ ఈ బస్సు వాహనాలపైకి ఎందుకు దూసుకొచ్చిందో తెలుసా..? సర్కిల్‌ వద్దకు రాగానే బస్సు డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపు తప్పింది. బస్సు డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే మృతి చెందాడు.