వైసీపీ పార్టీలో అసంతృప్తి నేతలు వైఎస్ షర్మిల కోసం ఎదురుచూస్తున్నారు…నక్కా ఆనందబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పార్టీలో అసంతృప్తి నేతలు పెరిగిపోతున్నారని, వారంతా ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల వస్తారేమోనంటూ ఎదురుచూస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వైసీపీ పార్టీ నేతలు ఇన్‌చార్జ్‌ల మార్పుపై ఆందోళనలతో ఉన్నారని, ఉద్యోగుల బదిలీల మాదిరిగా నేతల బదిలీలతో జగన్ ఫుట్‌బాల్ ఆడుతున్నారని, దీనివల్ల ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలలో ఓటమి నుండి జగన్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఇన్‌చార్జ్‌లను స్థానాలు మార్చడం ద్వారా జగన్ ఓటమిని ముందే అంగీకరించినట్లయ్యిందన్నారు. ఐప్యాక్ సర్వేలతో, వాలంటీర్లతో పార్టీని, రాష్ట్రాన్ని నడిపే జగన్‌ను జనం నమ్మరని,ఇకపై కార్యకర్తలు, ప్రజాదరణ మాత్రమే బలంగా సాగే తెలుగుదేశం పార్టీనే ప్రజలు విశ్వసిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఎస్సీ నియోజక వర్గంలోనూ జగన్ షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.