హైదరాబాద్‌లో సాయిప్రియ అదృశ్యం విషాదాంతం
ఒకవైపు దేశంలోనూ..మరోవైపు రాష్ట్రంలోనూ..అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట..ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు అమ్మాయిలపై ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. నగరంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన సాయిప్రియ దారుణ హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందని సాయిప్రియ ప్రియుడే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. సాయిప్రియను హత్యచేసి వనపర్తిలో పూడ్చి పెట్టాడు. అయితే నాలుగు రోజుల క్రితం సాయిప్రియ అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు నగరంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయిప్రియ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బరిలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. సాయిప్రియను తన ప్రియుడు శ్రీశైలమే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సాయిప్రియ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవౌతున్నారు. తమ కూతుర్ని ఘోరంగా హత్య చేసినందుకు నిందితుడు శ్రీశైలంకు కఠిన శిక్ష విధించాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

