హైదరాబాద్‌లో కలకలం రేపిన బాలుని అదృశ్యం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని బండ్లగూడా ప్రాంతంలో బుధవారం రాత్రి సాయిచరణ్ అనే 12 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. దీనితో బండ్లగూడా ప్రాంతంలో కలకలం రేగింది. కుటుంబ సభ్యులకు కిడ్నాప్ అనుమానాలు వస్తున్నాయి. బుధవారం రాత్రి వేళలో చిట్టీ డబ్బులు ఇవ్వాలని బయటకు వెళ్లాడు సాయిచరణ్. చాలా సేపయినా ఇంటికి తిరిగి రాలేదు. దీనితో కంగారు పడిన కుటుంబసభ్యులు ఆ ప్రదేశమంతా గాలించారు. అయినా బాలుని ఆచూకీ లభించలేదు. దీనితో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా రాత్రి అంతా బాలుని కోసం వెతికారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, వివరాలను రాబడుతున్నారు. ఫలితం లేకపోవడంతో చివరికి మైనర్ బాలుడు కావడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసి, దర్యాప్తును చేస్తున్నారు.

