శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఒకవైపు సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంటే, ఆ శాఖ మంత్రికి మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పడం ప్రభుత్వంలోని అస్తవ్యస్తతకు నిదర్శనమని మండిపడ్డారు.
థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని చెప్పుకునే కోమటిరెడ్డి, ఇప్పుడు తన శాఖలో జరుగుతున్న నిర్ణయాలపై తనకు సంబంధం లేదని అనడం విడ్డూరంగా ఉంది. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే జీవోలు ఎలా వస్తున్నాయి? ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ ‘రాజ్యాంగేతర శక్తి’ ఎవరో సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.
సినిమా రంగాన్ని ప్రభుత్వం రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకుందని హరీశ్‌రావు ఆరోపించారు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని , మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని ఇబ్బంది పెడతారని హరీశ్ రావు అన్నారు . ప్రభుత్వానికి నచ్చిన వారికి మాత్రం రూ. 600 టికెట్ రేటుకు అనుమతి ఇస్తూ రెడ్ కార్పెట్ వేస్తారా? అని నిలదీశారు. పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా టికెట్ల ధరల పెంపు ఉండదని చెప్పి, ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఆ వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఈ సినిమా టికెట్ల ధరల దందాపై గవర్నర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

