NationalNews

శశి థరూర్‌ను వీడని సునంద మృతి కేసు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసు నుంచి బయట పడలేకపోతున్నారు. సునంద హత్యలో థరూర్‌కు ప్రమేయం ఉందంటూ నమోదైన అభియోగాలను పాటియాలా హౌస్‌ కోర్టు కొట్టివేయడాన్ని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు నుంచి థరూర్‌ను పాటియాలా కోర్టు విముక్తి కల్పించిన 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం విశేషం. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ డీకే శర్మ.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్‌ 2014 జనవరి 17వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టించింది. తొలుత హత్యగా భావించి విచారణను ప్రారంభించిన పోలీసులు చివరికి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే.. ఆత్మహత్య చేసుకునేలా సునందను ప్రేరేపించారంటూ థరూర్‌పై పోలీసులు అభియోగాలు మోపారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించడంతో అభియోగాలను కొట్టివేసిన పాటియాలా హౌస్‌ కోర్టు థరూర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.